అమెరికాలో వివేక్ సైనీ (25) అనే భారత విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. జార్జియా రాష్ట్రంలోని లిథోనియాలో డ్రగ్స్‌కు అలవాటు పడిన జూలియన్ ఫాల్క్‌నర్ అనే ఓ నిరాశ్రయుడు సుత్తితో సైనీ తలపై దాదాపు 50 సార్లు కొట్టి కిరాతకంగా హత్య చేశాడు. ఈ నెల 16న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీటెక్ పూర్తిచేసిన సైనీ రెండేండ్ల క్రితమే హర్యానా నుంచి అమెరికాకు వెళ్లాడు. ఇటీవలే అక్కడ ఎంబీఏ పట్టా పొంది జార్జియాలోని ఓ స్టోర్‌లో పార్ట్‌టైమ్ క్లర్క్‌గా చేరిన సైనీకి అక్కడ ఫాల్క్‌నర్ కనిపించడంతో జాలిపడి చేరదీసి రెండ్రోజులపాటు సాయం చేశాడు. అతనికి చిప్స్, కోక్, నీళ్లు అందజేయడంతోపాటు వెచ్చదనం కోసం తన జాకెట్‌ను ఇచ్చేశాడు.
ఈ క్రమంలో ఫాల్క్‌నర్ ఎప్పటి మాదిరిగానే ఈ నెల 16న ఆ స్టోర్ వద్దకు వచ్చాడు. అయితే అప్పటికే స్టోర్‌ను మూసివేసి ఇంటికి బయలుదేరిన సైనీ, అక్కడి నుంచి వెళ్లిపోవాలని లేదంటే పోలీసులను రప్పిస్తానని ఫాల్క్‌నర్‌కు చెప్పాడు. దీంతో ఆగ్రహించిన అతడు సుత్తితో విచక్షణా రహితంగా సైనీ తలపై కొట్టాడు. ఈ సమాచారం తెలిసి పోలీసులు అక్కడికి వచ్చేసరికే సైనీ ప్రాణాలు కోల్పోయాడు.