నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న సినిమా తండేల్. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో చందూ మొండేటి రూపొందించారు. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. గురువారం బుజ్జి తల్లి అనే పాటను విడుదల చేశారు. దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన ఈ మెలోడీ గీతాన్ని శ్రీమణి రచించగా, జావేద్ అలీ ఆలపించారు. బాధలో ఉన్న ప్రియురాలిని కథానాయకుడు ఓదార్చే నేపథ్యంలో ఈ పాట సాగింది. గాలిలో ఊగిసలాడే దీపంలా, ఊగిసలాడే నీ ఊసందక నా ప్రాణం, నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా, చీకటి కమ్మెను నీ కబురందక నాలోకం, సుడిగాలిలో పడిపడిలేచే పడవల్లా తడబడుతున్నా, ఓ బుజ్జి తల్లి నీ కోసం అంటూ కథానాయకుడి మనోవేదనను ప్రతిఫలిస్తూ ఈ పాట సాగింది. సముద్రం నేపథ్యంలో విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
తీర ప్రాంతంలో జరిగే యథార్థ ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, మత్స్యకారుల జీవితానికి అద్దం పడుతూ దేశభక్తి ప్రధానంగా మెప్పిస్తుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: చందూ మొండేటి.