భారతీయ ఎన్నికలపై కామెంట్ చేసిన ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తరపున మెటా సంస్థ క్షమాపణలు చెప్పింది. కోవిడ్19 సమయంలో సరైన రీతిలో చర్యలు తీసుకోని ప్రభుత్వాలు కూలినట్లు జుకర్‌బర్గ్ ఇటీవల కామెంట్ చేశారు. అయితే ఆ దేశాల్లో భారత్ కూడా ఉన్నట్లు జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యల పట్ల మెటా సంస్థ సారీ చెప్పింది. మెటా ఇండియా పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ శివనాథ్ తూక్రల్ తన ఎక్స్ అకౌంట్‌లో జుకర్‌బర్గ్ తరపున క్షమాపణలు చెప్పారు.
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఆ సారీ స్టేట్మెంట్‌ను ట్యాగ్ చేశారాయన. కోవిడ్ తర్వాత అనేక దేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీలు ఓటమి చవిచూశాయన్న విషయం అనేక దేశాల్లో నిజమైందని, కానీ ఇండియా విషయంలో అది నిజం కాలేదన్నారు. ఆ తప్పు పట్ల తాము క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించారు. మెటా సంస్థకు ఇండియా చాలా కీలకమైన దేశమని పేర్కొన్నారు.
మరో వైపు మెటా సంస్థకు సమ్మన్లు జారీ చేయనున్నట్లు ఐటీ, కమ్యూనికేషన్స్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ నిశికాంత్ దూబే తెలిపారు. కోవిడ్ తర్వాత సుమారు 20 దేశాల్లో ఆయా పార్టీలు అధికారాన్ని కోల్పోయాయి. కానీ ఇండియాలో మాత్రం అలా జరగలేదు.