ప్రభాస్ కథానాయకుడిగా నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కల్కి 2898ఏడీ. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్, కమల్‌హసన్, దీపికా పడుకోన్, దిశాపటానీ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ వాడిన కారు బుజ్జి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. కొద్ది రోజుల క్రితం జరిగిన భారీ ఈవెంట్‌లో ఈ కారును పరిచయం చేశారు. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ కారు వివిధ నగరాల్లో సందడి చేస్తున్నది.

తాజాగా చెన్నై రోడ్లపై ఈ కారు విహరిస్తున్న ఫొటోలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోలను పోస్ట్ చేసిన ఆయన బుజ్జి వాహనాన్ని నడపాలంటూ టెస్లా కంపెనీ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ను కోరారు. డియర్ ఎలాన్ మస్క్ సర్ మీరు భారత్‌కు వచ్చి మా బుజ్జిని నడపాలని కోరుకుంటున్నాం. ఇదొక ఇంజనీరింగ్ అద్భుతం. పూర్తిగా ఎలక్ట్రిక్ కారు. ఇండియాలోనే తయారు చేశాం. దీని బరువు ఆరు టన్నులు. మీ కంపెనీ టెస్లా తయారు చేసిన సైబర్‌ట్రక్, బుజ్జి కలిసి ప్రయాణం చేస్తే చూడ ముచ్చటగా ఉంటుంది అని పేర్కొన్నారు. ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
