ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం అటు రాజకీయ రంగంతోపాటు ఇటు వ్యాపార రంగంలోనూ తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్‌లో సోలార్ పవర్ ప్రాజెక్టులు దక్కించుకోవ డానికి అదానీ గ్రూప్, వివిధ రాష్ర్టాల్లోని ఉన్నతాధికారులకు 265 మిలియన్ డాలర్లు (రూ. 2,238 కోట్లు) లంచంగా ఇవ్వజూపినట్టు న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ఇదే విషయమై ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారానికి సంబంధించి గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు, అదానీ గ్రీన్ ఎనర్జీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సాగర్ అదానీతో పాటు మరో ఆరుగురిపై కేసులు నమోదవ్వడమే గాకుండా యూఎస్ కోర్టు అరెస్టు వారెంట్ కూడా జారీ చేసింది.
ఈ వ్యవహారంపై తాజాగా అమెరికా స్పందించింది. ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమించగలవని తాము విశ్వసిస్తున్నట్లు అధ్యక్ష భవనం శ్వేతసౌధం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆరోపణలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్, న్యాయశాఖనే సరైన సమాధానం ఇవ్వగలవని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరీన్ జీన్ పియర్ తెలిపారు. భారత్-అమెరికా సంబంధాలు దృఢంగా ఉన్నాయని, ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు కలిసి అధిగమిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.