నార్వే తెలుగు సంఘం(ఎన్ టిఎ) ఆధ్వర్యంలో దశమ వార్షికోత్సవం, ఉగాది వేడుకలు సందడిగా సాగాయి. ఓస్లో నగరంలో నిర్వహించిన ఈ దశాబ్ది ఉత్సవాలు ప్రవాస భారతీయుల సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పాయి. ఈ కార్యక్రమానికి అకెర్షస్ కౌంటీ డిప్యూటీ మేయర్ ఓలే జాకబ్ జోహన్సెన్, నార్వేలోని భారత రాయబార కార్యాలయ సెకండ్ సెక్రటరీ ఎస్.మాగేష్ కుమార్, ఆస్కర్ మేయర్ లెనె కాన్రాడి అతిథులుగా విచ్చేశారు. 350 మందికి ప్రవాస తెలుగు వారు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.


భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ అభినందనలను వీడియో సందేశంలో పంపించారు.

స్థానిక ప్రవాస చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, స్టాక్హోమ్ అలెన్ స్కూల్ ఆఫ్ డాన్సెస్ ప్రదర్శన, నాట్య కళాభారతి డాక్టర్ సరళకుమారి కూచిపూడి నృత్యం, ముద్ర డాన్స్ అకాడమీ ప్రదర్శన ఆకట్టుకున్నాయి. ఈ పదేళ్ల ప్రయాణంలో తోడ్పాటునందించిన పాత కార్యవర్గ బోర్డు సభ్యులకు ప్రత్యేక మెమెంటోలు ఇచ్చి ఘనంగా సత్కరించారు. తెలుగు సంస్కృతిని విదేశీ గడ్డపై పది కాలాల పాటు పదిలపరుస్తున్న నార్వే తెలుగు సంఘాన్ని అతిథులు కొనియాడారు.















