కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రధాని మోదీని ఉద్దేశించి పనౌటి, పిక్ పాకెట్ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలపై ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్యల వ్యవహారంలో నవంబర్ 25వ తేదీలోగా సమాధానం చెప్పాలని కోరింది. ఇటీవల రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రస్తావించారు. మన కుర్రాళ్లు అద్భుతంగా ప్రపంచకప్‌ను దాదాపు గెలిచారు కానీ ఓటమి పాలయ్యారు. అయితే, అక్కడికి వచ్చిన ఓ అపశకునం వల్లే ఓడిపోయారంటూ ప్రధానిని ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యనించారు. అలాగే, జేబుదొంగల కథను చెప్పారు. ముగ్గురు వ్యక్తులు పిక్ పాకెట్ కోసం వస్తారు. ఓ జేబుదొంగ దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తాడు. రెండోవాడు వెనుక నుంచి జేబును కత్తిరిస్తాడు. మూడోవాడు చూస్తూ ఉండి దాడికి సిద్ధంగా ఉంటాడు అని వ్యాఖ్యానించారు.
జేబు దొంగల దృష్టి మళ్లించే వ్యక్తి ప్రధాని మోదీ అని, జేబులు కొట్టేవాడు అదానీ అని, మూడో జేబుదొంగ అమిత్ షా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు.