ఫ్రాన్స్‌లో జరుగుతున్న 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కోల్‌కతాకు చెందిన అనసూయ సేన్ గుప్తా ఉత్తమ నటిగా పురస్కారాన్ని గెలుపొంది సంచలనం సృష్టించింది. ది షేమ్‌లెస్ చిత్రానికిగాను ఆమె ఈ అవార్డు అందుకుం ది. ప్రతిష్టాత్మక కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకున్న తొలి భారతీయ మహిళగా అనసూయ రికార్డు సృష్టించింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ముఖ్యమైన అన్‌సర్టెయిన్ రిగార్డ్ విభాగంలో ఆమె ఈ పురస్కారాన్ని దక్కించుకుంది.
ది షేమ్‌లెస్ చిత్రాన్ని బల్గేరియన్ దర్శకుడు కాన్‌స్టాంటిన్ బొజనోవ్ తెరకెక్కించాడు. ఈ సినిమాలో రేణుక అనే వేశ్య పాత్రలో నటించింది అనసూయ. ఓ పోలీసును చంపి ఢిల్లీ వేశ్య వాటిక నుంచి పారిపోయిన రేణుక సెక్స్ వర్కర్ల కమ్యూనిటీలో ఆశ్రయం పొందుతుంది. అక్కడ పరిచయమైన ఓ అమ్మాయితో ఆమె ప్రయాణం ఎలా సాగిందన్నదే ఈ చిత్ర కథ. అనసూయ సేన్‌గుప్తాకు అవార్డు రావడం పట్ల పలువురు భారతీయ నటులు ఆనందం వ్యక్తం చేశారు.