అమెరికాలో సంచలనం సృష్టించిన తన సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్యపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. తమ దేశ యువత మనసును చార్లీ కంటే గొప్పగా మరెవరూ అర్ధం చేసుకోలేరని పేర్కొన్న ట్రంప్, కిర్క్‌కు అమెరికా అత్యున్నత పురస్కారం ఇస్తున్నట్టు ప్రకటించారు. మరణాంతరం కిర్క్‌కు ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ గౌరవం కల్పిస్తున్నట్టు ప్రెసిడెంట్ వెల్లడించారు. అమెరికా సమాజం కోసం, దేశ ప్రయోజనాల కోసం కృషి చేసిన పౌరులకు ఇచ్చే అత్యున్నత పురస్కారమే ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్.

తన తరంవాళ్లలో చార్లీ ఒక యోధుడు. స్వేచ్ఛ కోసం పోరాడిన ఛాంపియన్. అమెరికాలోని లక్షలాది మందికి అతడు స్ఫూర్తి. అతడిని మనం ఎంతగానో మిస్ అవుతాం. చార్లీ మరణించినప్పటికీ అతడి మాటలు, అతడిచ్చిన ధైర్యం కోట్లాదిమంది గుండెల్లో, ముఖ్యంగా యువత హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది అని ట్రంప్ పేర్కొన్నారు.
















