అయోధ్యలో రామ మందిర పునఃప్రతిష్ఠాపనకు ముహూర్తం సమీపిస్తోంది. ఈనెల 22న మధ్యాహ్నం 12.20 గంటలకు శాస్త్రోక్తంగా శ్రీరాముడి పట్టాభిషేక కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రామ మందిర పునఃప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. తాజాగా పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్ఎస్ఎస్ ప్రాంత సంపర్క ప్రముఖ్ ముళ్లపూడి జగన్, వీహెచ్‌పీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస రెడ్డి, ఆర్.ఎస్.ఎస్. కార్యాలయ ప్రముఖ్ పూర్ణ ప్రజ్ఞ పవన్ కల్యాణ్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా అయోధ్యలో నిర్మితమైన రామాలయం విశేషాలను, రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి సంబంధించిన విశేషాలను పవన్ కల్యాణ్ కు తెలియజేశారు.
కాగా అయోధ్య రామ మందిరం నిర్మాణం ప్రారంభం కాగానే పవన్ కల్యాణ్ 30 లక్షల రూపాయలు శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌కు విరాళంగా అందజేశారు. 2021లో తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో విరాళానికి సంబంధించిన చెక్కును శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రతినిధులకు అందజేశారు పవన్. అలాగే దేశంలోని వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.