తాలిబన్ల అధీనంలోకి వెళ్లిన అఫ్గానిస్థాన్‌లో పాక్ చర్యల్ని భారత్`అమెరికా నిశితంగా గమనిస్తున్నాయని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా తెలిపారు. అఫ్గాన్ తాజా పరిణామాల నేపథ్యంలో భారత్ లేవనెత్తుతున్న ఆందోళనల పట్ల తాలిబన్లు సానుకూలంగానే ఉన్నట్లు సంకేతాలందాయన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన ఆయన ఆ దేశ విదేశాంగ మంత్రి బ్లింకెన్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అఫ్గాన్‌లో పరిస్థితులు ఇంకా అస్థిరంగానే ఉన్నాయని తెలిపారు. పరిణామాలు వేగంగా మారుతున్నాయన్నారు. అఫ్గాన్‌లోని పరిస్థితులు, పాకిస్థాన్ పాత్రపై అమెరికాతో నిరంతరం సంప్రదింపులు కొనసాగుతాయని తెలిపారు.
అమెరికా వేచి చూసే ధోరణిని అవలంభిస్తోందన్నారు. భారత్ సైతం ఇదే విధానాన్ని కొనసాగిస్తోందన్నారు. తాలిబన్లు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారో లేదో చూడాల్సి ఉందన్నారు. తాలిబన్లతో తమ భేటీ చాలా తక్కువ సమయమే జరిగిందన్నారు. ఏ విషయంపైనా విస్తృత స్థాయిలో చర్చలు జరగలేదన్నారు. అయితే, భారత్ లేవనెత్తుతున్న ఆందోళన పట్ల సహేతుకంగానే ప్రవర్తించే అవకాశం ఉన్నట్లు వారు సంకేతాలిచ్చారన్నారు. ఉగ్రవాదానికి అఫ్గాన్ భూభాగం అడ్డాగా మారొద్దని తాలిబన్లకు స్పష్టంగా చెప్పామని శ్రింగ్లా తెలిపారు. మహిళలు, మైనారిటీల పట్ల విచక్షణతో వ్యవహరించాలని కోరామన్నారు. వీటిపై వారు సానుకూలంగా స్పందించారన్నారు.