ప్రధాని మోదీ పోలాండ్ పర్యటనలో ఉన్నారు. నాలుగు దశాబ్ధాల తర్వాత భారతీయ ప్రధాని ఆ దేశానికి వెళ్లారు. 1979లో చివరిసారి ఆనాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ఆ దేశంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ కొన్ని దశాబ్ధాలుగా, అన్ని దేశాలకు దూరంగా ఉండాలన్న రీతిలో భారత విదేశాంగ విధానం ఉండేదన్నారు. కానీ ఇప్పుడు విదేశీ విధానంలో 180 డిగ్రీల మార్పు వచ్చిందన్నారు. ప్రస్తుతం పరిస్థితి మారిందని, అన్ని దేశాలతోనూ సన్నిహిత సంబంధాలను కలిగి ఉండడమే భారతీయ విధానమని ప్రధాని మోదీ వెల్లడించారు. నేటి భారత్ ప్రతి ఒక్కరితోనూ కనెక్ట్ కావాలని చూస్తోందన్నారు. ప్రతి ఒక్కరికీ లాభం చేకూరాలని భారత్ ఆలోచిస్తోందన్నారు. భారత్‌ను విశ్వబంధుగా ప్రపంచ దేశాలు గౌరవిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.