డీప్ ఫేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ జనరేట్ కాంటెంట్‌పై వాటర్ మార్కింగ్ లేదా క్లియర్ డిక్లరేషన్ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. కెనడాలోని ఆల్‌బెర్టాలో జరుగుతున్న జీ7 దేశాల సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన డీప్ ఫేక్ కాంటెంట్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ ఆధారిత సమస్యలను తగ్గించాలని ఆయన సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్నోవేషన్ విషయంలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించేందుకు గ్లోబల్ గవర్నెన్స్ అవసరమని ప్రధాని మోదీ వెల్లడించారు. ప్రస్తుతం ఏఐ యుగం నడుస్తోందని, టెక్నాలజీతో అవసరమైన వ్యవస్థను సురక్షితంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు.

ఏఐ అనేది ఎనర్జీ ఇంటెన్సివ్ టెక్నాలజీ వ్యవస్థగా మారిందని, టెక్నాలజీ ఆధారిత సమాజాన్ని నిర్మించాలంటే, రెన్యువబుల్ ఎనర్జీ అవసరమన్నారు. సరసమైన, నమ్మదగిన, స్థిరమైన వ్యవస్థలను తీర్చిదిద్దడమే భారతదేశ ప్రాముఖ్యత అని మోదీ పేర్కొన్నారు. టెక్నాలజీ వల్ల ప్రజలకు లబ్ది జరిగితేనే, అప్పుడు దాన్ని విలువైనదని భావిస్తామని, ఇలాంటి అంశాల్లో ఏ దేశాన్ని కూడా వెనక్కి నెట్టాల్సిన అవసరం లేదన్నారు. భారత్ తన టెక్నాలజీని ప్రజాస్వామ్య పరం చేసిందని, దాంతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిందని, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా సాధారణ ప్రజల్ని బలోపేతం చేసినట్లు చెప్పారు. సమగ్రమైన, సామర్థ్యవంతమైన, బాధ్యతాయుతమైన ఏఐ అవసరమని పేర్కొన్నారు.
