ప్రస్తుతం అమెరికాలో గ్రీన్‌కార్డులు, వీసాల జారీ, వలసపోవడం కష్టతరంగా మారాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 16 లక్షల కొత్త దరఖాస్తులు రాబోతున్నాయి. ఇప్పటి వరకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లో ఇమ్మిగ్రేషన్ బ్యాక్ లాగ్ లో 1.13 కోట్ల దరఖాస్తులు ఉన్నాయి. గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులు వాడే ఫారమ్ ఐ-90 సగటు వెయిటింగ్ టైమ్ 0.8 నెలల నుంచి 8 నెలలకు చేరింది. ఫారమ్ ఐ-765ల్లో దాదాపు 2 మిలియన్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో భారతీయులకు గ్రీన్‌కార్డుల్లో భారీ జాప్యం ఎదురవుతుంది. రెండో త్రైమాసికంలో ప్రాసెస్ చేసిన దరఖాస్తులు గతేడాది 3.3 మిలియన్లు చేయగా, ఈసారి 2.7 మిలియన్లకే పరిమితమైంది.

ప్రస్తుతం అమెరికాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్పొరేట్ లీడర్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల వర్క్ పర్మిట్‌లు ముగియడంతో వారి ఉద్యోగం కోల్పోవలసి వస్తుంది. వాటి పునరుద్ధరణ వెంటనే జరగకపోవడంతో వారు పదవుల నుంచి వైదొలగాల్సివస్తోంది. గ్రీన్‌కార్డ్‌ల జారీలో జాప్యం వల్ల, కొన్నేళ్లుగా అమెరికాలో వివిధ కంపెనీల్లో పని చేస్తున్నవారు కూడా ఆ దేశాన్ని విడిచి వెళ్లేలా చేస్తుంది.

వర్క్ పర్మిట్ గడువు ముగియడంతో మెట్రోపాలిటన్ అట్లాంటా ర్యాపిడ్ ట్రాన్సిట్ అథారిటీ సీఈఓ కొల్లీ గ్రీన్‌వుడ్ ఈ నెల 17న రాజీనామా చేశారు. కెనడా జాతీయుడైన గ్రీన్‌వుడ్ ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ గడువు జూన్ 18న ముగిసింది. ఆయనకు గ్రీన్ కార్డ్ మంజూరులో జాప్యం జరుగుతుండటంతో పదవిలో కొనసాగడం ఇక అసాధ్యంగా మారింది. అందుకే ఆయన ముందస్తు పదవీ విరమణను ఎంచుకున్నారు. త్వరలోనే గ్రీన్ కార్డ్ వచ్చేస్తుందని ఈ అథారిటీ ఆయనకు భరోసా ఇచ్చినప్పటికీ ఆయన రాజీనామా చేశారు. అమెరికా ట్రాన్సిట్ సెక్టార్‌లో ఇటీవల హై-ప్రొఫైల్ ఎగ్జిక్యూటివ్‌ల రాజీనామాలు పెరిగిపోతున్నాయి. ఆపరేషనల్ ఛాలెంజెస్‌తోపాటు ఇమిగ్రేషన్ టైమ్‌లైన్స్ కఠినంగా ఉండటమే దీనికి కారణం.
















