అంతర్జాతీయ మహిళల దినోత్సవం ఉత్సవాన్ని పురస్కరంచుకుని గ్లోబల్ తెలంగాణ సంఘం (జి.టి.ఎ) డెట్రాయిట్ మహిళా విభాగం నిర్వహించిన లేడీస్ నైట్ అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య ముఖ్య అతిథిగా భారతీయ సంతతికి చెందిన జిల్లా న్యాయమూర్తి జస్టిస్ షాలినా కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమెరికాతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో భారతీయ మహిళలు అందిస్తున్న ఎనలేని సేవలను, కనబరుస్తున్న విశేష ప్రతిభా పాటవాలను కొనియాడారు. మహిళలు అన్ని రంగాల్లో రెట్టించిన ఉత్సాహంతో ముందుకుసాగాలని సూచించారు.

ఈ వేడుకలకు ముఖ్య వక్త గా విచ్చేసిన ప్రొఫెసర్ పద్మజ నందిగామ మాట్లాడుతూ మహిళలు కుటుంబం కోసం రోజూ నిర్వహించే సేవలు వెల కట్టలేనివని అన్నారు. అనంతరం కార్యక్రమ నిర్వహణ కమిటీ సభ్యులు సుష్మ పదుకొనే, సుమ కల్వల మాట్లాడుతూ అమెరికా వ్యాప్తంగా ఉన్న తమ సంఘం వనితా బృందాలు రాబోయే రోజుల్లో మహిళా దినోత్సవ కార్యక్రమాలను మరింత ఘనంగా నిర్వహించడానికి కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో సుమారు 350 మంది విభిన్న భాషా సంస్కృతులకు చెందిన భారతీయ మహిళలు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందించారు. భారతీయ వంటకాలు కార్యక్రమానికి హాజరైన వారిని ఎంతగానో ఆకర్షించాయి. శ్రీకాంత్ సందుగు పాటలతో ప్రేక్షకులను అలరించారు. వ్యాఖ్యాత సాహిత్య వింజమూరి తనదైన శైలి మాటలతో ఆకట్టుకున్నారు.

ఈ కార్యక్రమానికి సహకరించిన సుష్మ పదుకొనే, సుమ కల్వల, స్వప్న చింతపల్లి, దీప్తి వెనుకదాసుల, దీప్తి లచ్చిరెడ్డిగారి, హర్షిణి బీరపు, అర్పిత భూమిరెడ్డి, కల్యాణి ఆత్మకూరు, శిరీషారెడ్డి, డాక్టర్ అమిత కాకులవరం తదితరులను జీటీఎ డెట్రాయిట్ కార్యవర్గం అభినందించింది. డెట్రాయిట్‌లో వేడుకలను విజయవంతం చేయడానికి సహకరించిన జీటీఏ ఛైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి కలువల, అధ్యక్షుడు ప్రవీణ్ కేసిరెడ్డి, జీటీఏ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలకు పలువురు ధన్యవాదాలు తెలిపారు.

