అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులంటే భారతీయ వివాహ మార్కెట్లో ఒకప్పుడు తిరుగులేని డిమాండ్ ఉండేది. ఆర్థిక భద్రత, మెరుగైన జీవన ప్రమాణాలకు హామీగా భావించే ఈ సంబంధాల పట్ల ఇప్పుడు కుటుంబాలు వెనుకంజ వేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠినమైన ఇమిగ్రేషన్ విధానాలు, ముఖ్యంగా హెచ్-1బీ వీసాపై ఆంక్షలు ఈ మార్పును తీసుకొచ్చాయి.

హర్యానాకు చెందిన 19 ఏళ్ల మెడికల్ స్టూడెంట్ సిద్ధిశర్మ అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయ పౌరుడిని పెళ్లి చేసుకోవాలని కలలు కనేది. అయితే, ట్రంప్ ఇమిగ్రేషన్ నిబంధనలు ఆమె ఆశలపై నీళ్లు చల్లాయి.అమెరికాలో స్థిరపడాలని కలలు కన్నాను. ట్రంప్ నా తలుపులు మూసేశారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అమెరికా ఇమిగ్రేషన్ విధానాలు కఠినతరం కావడం, ముఖ్యంగా హెచ్-1బీ స్కిల్డ్ వర్కర్ వీసాలపై ఆంక్షలు పెరగడంతో అమెరికా సంబంధాలపై భారతీయులలో మోజు తగ్గిపోయింది. తమ పిల్లలకు కాబోయే జీవిత భాగస్వామికి అమెరికాలో ఉద్యోగం లేదా ఇమిగ్రేషన్ హోదా ఎక్కడ పోతుందోనన్న భయం భారతీయ కుటుంబాలలోని తల్లిదండ్రులను వెంటాడుతోంది. గతంలో మాదిరిగా అమెరికా సంబంధాలపై భారతీయ కుటుంబాలలో వెంపర్లాట తగ్గిపోయిందని పెళ్లి సంబంధాలు కుదిర్చే సంస్థలు, విద్యావేత్తలు, పెళ్లీడు పిల్లలు తెలిపారు.
















