మట్టి గణనాథుని కోసం బారులు తీరిన భక్త జనం. విగ్రహ తయారీ మరియు పంపకంలో నిర్విరామంగా నిమగ్నమైన GATA బృందం.
2024, సెప్టెంబరు 2న, గ్రేటర్ అట్లాంటా తెలుగు సంఘం వారు కమ్యూనిటీ జాయింట్ వెంచర్ పార్క్ లో , సంస్థ కార్యకర్తలు మరియు స్వచ్ఛంద సహకారులు తయారు చేసి అందిస్తున్న మూషికవాహనుని విగ్రహాలకై బారులు తీరిన వాహనాల సంఖ్య అందరినీ అబ్బురపరిచింది. మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలకు మొదలు పెట్టగా నిర్విరామంగా రాత్రి 7 గంటల వరకూ విగ్రహాలను తయారు చేస్తూనే ఉండటం అనూహ్యం. చిన్న పెద్ద అందరూ ఉత్సాహంగా తమ తమ సహకారాన్ని అందించగా 1000 కి పైగా మట్టి వినాయకులను తయారు చేసి బొజ్జ గణపయ్య సేవలో తరిస్తూ చిరునవ్వులతో అందరికీ అందించడం హర్షణీయం, GATA ఆధ్యాత్మిక సేవా తాత్పర్యం ముమ్మాటికీ అభినందనీయం.
వినాయక చతుర్థి సందర్భంగా ప్రతీ ఏటా GATA వారు అక్కడికక్కడే మట్టి వినాయకులను తయారు చేసి పంచగా , అందుకునే భక్తుల సంఖ్య ప్రతీ ఏటా అంతకంతకూ పెరగడం , సంస్థ సేవా సంకల్పానికి ఎనలేని శక్తి సామర్థ్యాలను కలుగచేస్తుంది అనడం లో అతిశయోక్తి లేదు.
నిరాడంబర సేవా విధానంతో , అనునిత్యం అనూహ్య సాంస్కృతిక కళా సేవా కార్యకలాపాలతో తెలుగు వారిని అలరించి ఆదరించే GATA రానున్న కాలంలో మరెన్నో అద్భుత కార్యక్రమాలను చేపట్టబోతుందని, అందుకు గాను అందరి సహాయ సహారాలు , ఆదరాభిమానాలు సదా కొనసాగాలని ప్రత్యేకంగా నివేదించారు GATA 2024 Chief Coordinator స్వప్న కాస్వా.