ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో మోదీ భేటీ అయ్యారు. వైట్ హౌస్కు వెళ్లిని మోదీని ఆప్యాయంగా కౌగిలించుకున్న ట్రంప్ మిమ్మల్ని నేను చాలా మిస్సయ్యాను మిత్రమా అంటూ మోదీని ఉద్దేశించి అన్నారు. ఇరువురూ కాసేపు ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా తన ఫ్రెండ్ మోదీకి ట్రంప్ స్పెషల్ గిఫ్ట్ను ఇచ్చారు. తాను స్వయంగా రాసిన అవర్ జర్నీ టుగెదర్ అనే పుస్తకాన్ని ప్రధానికి కానుకగా ఇచ్చారు. అది ఓ ఫొటో బుక్. గతంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కీలక సందర్భాలు, స్పెషల్ ఈవెంట్స్లో మోదీతో ఉన్న ఫొటోలను అందులో పొందుపరిచారు.
ఇక 2019లో మోదీ అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ హౌడీ మోదీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత 2020లో ట్రంప్ భారత్ పర్యటనకు వచ్చినప్పుడు నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ బుక్పై మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ యూ ఆర్ గ్రేట్ అని రాసి ట్రంప్ సంతకం చేశారు. ఈ పుస్తకంలో ఇద్దరూ ఉన్న ఫొటోలను మోదీకి ట్రంప్ చూపించారు.
