క్వాంటం స్కేప్ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో జగ్దీప్‌సింగ్ ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న వ్యక్తిగా వార్తల్లోకెక్కారు. అసాధారణ రీతిలో ఆయన ఏడాది కాలానికి రూ.17,500 కోట్లు ఆర్జించారు. అనగా రోజుకు రూ.43 కోట్ల చొప్పున అందుకున్నారు. ప్రపంచంలోని అనేక పేరొందిన కార్పొరేట్ సంస్థలు సైతం ఈ స్థాయిలో వార్షిక ఆదాయాన్ని పొందడం లేదు. ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగించే బ్యాటరీల సాంకేతిక పరిజ్ఞానంలో సాధించిన నైపుణ్యం నేపథ్యంలో ఆయన ప్రఖ్యాతిగాంచారు.
ఆ పరిజ్ఞానంతోనే 2010లో క్వాంటం స్కేప్‌ను స్థాపించారు. ఈ కంపెనీ రేపటితరం బ్యాటరీలను ఉత్పత్తి చేస్తున్నది. ఈ బ్యాటరీలలో ఇంధన సామర్థ్యం, తక్కువ సమయంలో చార్జింగ్ అనే ప్రత్యేకతలు పలు అగ్రశ్రేణి కార్ల తయారీ కంపెనీలను ఆకర్షించాయి. ఫోక్స్‌వాగన్, బిల్‌గేట్స్ వంటి దిగ్గజాలు క్వాంటం స్కేప్‌లో పెట్టుబడులు పెట్టారు. గత ఏడాది ఫిబ్రవరి 16న సీఈవోగా రాజీనామా చేసిన జగ్దీప్ సింగ్ ఆ బాధ్యతలను శివశివరాంకు అప్పగించారు.