హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లకు (దాదాపు రూ. 88 లక్షలు) పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నెలరోజుల తర్వాత ఫీజును ఎలా చెల్లించాలో, ఈ ఫీజు నుంచి ఎవరికి మినహాయింపు లభిస్తుందో వివరాలు వెల్లడించింది. అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) ఫీజు పేమెంట్ పోర్టల్‌ను ప్రవేశపెడుతూ ఫీజు చెల్లించినట్లు రసీదు సమర్పించిన దరఖాస్తుదారులు మాత్రమే తదుపరి అడుగులు వేయాలని, అయితే కొందరు స్టూడెంట్ వీసాదారులకు మాత్రం ఫీజు రాయితీ ఉంటుందని తెలిపింది.

ఎఫ్-1 వీసాలపై ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు, ఎల్-1 వీసాలపై ఉన్న ప్రొఫెషనల్స్‌తోసహా ప్రస్తుత వీసాదారులు హెచ్-1బీ హోదా కోసం దరఖాస్తు చేసినపుడు లక్ష డాలర్లను చెల్లించవలసిన అవసరం లేదని యూఎస్‌సీఐఎస్ వెల్లడించింది. అమెరికా వెలుపల ఉన్న వ్యక్తులు దాఖలు చేసే దరఖాస్తులకు మాత్రం కొత్త ఫీజు వర్తిస్తుందనిగ్రీన్ అండ్ స్పీగెల్‌కు చెందిన డాన్ బెర్గెర్ తెలిపారు. అమెరికాను వీడి ఉండి ప్రస్తుత హెచ్-1బీ వీసాపై దేశంలోకి తిరిగి ప్రవేశించడం కోసం మళ్లీ దరఖాస్తు చేసుకునే వారికి కొత్త ఫీజు వర్తిస్తుందని యూఎస్‌సీఐఎస్ తెలిపింది. హోదా మార్పు లేదా స్టే పొడిగింపునకు దరఖాస్తుదారు అర్హుడు కాదని తాము నిర్ధారిస్తే కంపెనీ యజమాని ఫీజును చెల్లించాల్సిన అవసరం ఉంటుందని యూఎస్‌సీఐఎస్ పేర్కొంది.















