అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మరోసారి జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ తలపడబోతున్నారు. 15 రాష్ర్టాల్లో సూపర్ ట్యూస్‌డే ప్రైమరీ ఎన్నికలు జరగగా, అన్ని రాష్ర్టాల్లోనూ ఓడిపోవడంతో ఇండియన్-అమెరికన్ నిక్కీ హేలీ తన ప్రచారాన్ని నిలిపేశారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకున్నారు. నిక్కీ హేలీ సౌత్ కరోలినాలో మాట్లాడుతూ, నా ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్‌ను నిలిపేయవలసిన సమయం వచ్చింది అన్నారు. అమెరికన్లు తమ గళాలను వినిపించాలని తాను కోరుకుంటున్నానని చెప్పానని, అదే చేశానని చెప్పారు. తనకు విచారం లేదన్నారు. తాను అభ్యర్థిని కాకపోయినప్పటికీ, తాను నమ్మిన విషయాల కోసం గళమెత్తడాన్ని ఆపబోనని స్పష్టం చేశారు. అయితే ఆమె ఈ క్యాంపెయిన్‌లో చరిత్ర సృష్టించారు. రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ ప్రైమరీని గెలుచుకున్న తొలి మహిళగా, ఓ డెమొక్రాటిక్ లేదా రిపబ్లికన్ ప్రైమరీలో విజయం సొంతం చేసుకున్న తొలి ఇండియన్-అమెరికన్‌గా ఘనత సాధించారు.