తానా ఫౌండేషన్ మాజీ ట్రెజరర్ శ్రీకాంత్ పోలవరపు ఎవరినీ సంప్రదించకుండా చట్టవిరుద్ధంగా తానా ఫౌండేషన్ బ్యాంక్ అకౌంట్ నుంచి తన సొంత కంపెనీకి 3.65 మిలియన్ డాలర్ల నిధులు మళ్లించిన సంగతి ఇంతకుముందు తానా సభ్యులకు తెలియచేసాము. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన తానా బోర్డు, తప్పు ఒప్పుకున్న శ్రీకాంత్ నుంచి మొత్తం నిధులు తిరిగి రాబట్టేందుకు చర్యలు తీసుకుంటోంది.
ఇందులో భాగంగా ఇప్పటి వరకు తానా బోర్డు విడతల వారీగా ఐదు లక్షల డాలర్లు శ్రీకాంత్ నుంచి రికవరీ చేసింది. మిగతావి కూడా రికవరీ చేసేలా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ‘FBI’ కి రిపోర్ట్ చేసి వారి సహాయ సకారాలతో ముందుకు కోనసాగుతుంది. అలాగే 2019 జనవరి 1 నుండి ఇప్పటి వరకు సంబంధించిన అదనపు సమాచారాన్ని FBI కోరింది. ఏది ఏమైనా అన్ని సమస్యలను సమర్థవంతంగా మరియు పారదర్శకంగా పరిష్కరించేందుకు తానా సంస్థ పూర్తిగా కట్టుబడి ఉంది. ఇటీవల కొన్ని మీడియాలలో ప్రసారమవుతున్న వివిధ అసత్య, అసంపూర్ణ ఊహాగానాలను నమ్మొద్దని తెలియపరుస్తున్నాము. ఈ అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నాము.
ఈ అంశం ప్రస్తుతం ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో దర్యాప్తు దశలో ఉండటం వలన పరిస్థితులను నిశితంగా గమనిస్తూ మరిన్ని వివరాలు ముందు ముందు తానా సభ్యులకు తెలియపరుస్తామని విన్నవించుకుంటున్నాము. FBI సహకారంతో చట్టబద్ధంగా మరియు పారదర్శకంగా తానా సంస్థ పని చేస్తుంది. ఈ సందర్భంగా తానా సభ్యులు మీడియా ఊహాగానాలను నమ్మకుండా సంయమనం పాటించాల్సిందిగా తానా బోర్డు చైర్మన్ డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి విజ్ఞప్తి చేస్తున్నారు.