సౌదీ అరేబియా తెలుగు సంఘం (సాట) ఆధ్వర్యంలో రియాధ్ నగరంలో జరిగిన దసరా మరియు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు ప్రవాసీ కుటుంబాలలో ఒక నూతనోత్తేజాన్ని నింపడంతో పాటు ఆధ్యాత్మిక మరియు సంస్కృతి, ఆచార వ్యవహారాల స్ఫూర్తిని ప్రతిబింబించాయి. లక్ష్మితోపాటు నెల్లూరుకు చెందిన తాటి శ్రీదేవి మల్లికార్జున్, గీతా శ్రీనివాస్, చిత్తూరుకు చెందిన పబ్బతి సింధూరలు చేసిన వేద మంత్రాల ఘోష పూర్తి స్థాయిగా ఆధ్యాత్మిక వాతవారణాన్ని సృష్టించింది. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ సంబురాల్లో మంథనికి చెందన లోకే సుధా ప్రశాంత్.. గౌరీ దేవికి ప్రత్యేక నైవేధ్యాన్ని సమర్పించారు. హైదరాబాద్కు చెందిన లావణ్య నాగార్జున, శ్వేత రియాజోద్దీన్, కండాల సుచరిత, నల్గొండకు చెందిన గౌతమి తదితరులు కూడా ఆమెకు తోడయ్యారు.
ముందుగా రెండు బతుకమ్మలతో వేడుక నిర్వహించాలని ప్రణాళిక రూపొందించినా.. ఔత్సాహిక మహిళలు ముందుకు రావడంతో.. మొత్తం 11 బతుకమ్మలతో వేడుక జరిగిందని లోకె సుధా ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం గీతా శ్రీనివాస్ మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు కేవలం టీవీల్లో మాత్రమే ఈ వేడుకలు చూసినట్టు వ్యాఖ్యానించారు. నెల్లూరుకు చెందిన అమె తన తల్లితో కలిసి జీవితంలో తొలిసారిగా బతుకమ్మ ఉత్సవాలలో పాల్గోన్నారు. చివరగా సాటా నాయకులు మల్లేషన్, జి. అనందరాజు, ముజమ్మీల్, వినయ చేంగూరి తదితరులు మాట్లాడుతూ.. అందర్నీ కలుపుకొంటూ అందరి సహకారంతో అన్ని పండుగలను నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. కోలాటాల కోలహలం ఉత్సహాన్ని మరింత రెట్టింపు చేయగా.. పూర్తిగా భద్రతా నియామాలు పాటిస్తూ సంప్రదాయం ప్రకారం చేసిన రావణ దహనం రామ్లీలా మైదాన్ని మరిపించింది.














