స్వీయ దర్శకత్వంలో విక్రాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం స్పార్క్. మోహరీన్ ఫిర్జాదా, రుక్సర్ థిల్లాన్ కథానాయికలు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్నది. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నవంబర్ 17న విడుదలకానుంది. ఈ సినిమాలోని ఏమా అందం అనే తొలి గీతాన్ని విశాఖపట్నంలో విడుదల చేశారు. ఖుషి ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరాల్ని సమకూర్చిన ఈ గీతానికి అనంత్‌శ్రీరామ్ సాహిత్యాన్నందించారు. సిధ్‌శ్రీరామ్ ఆలపించారు. ఏమా అందం ఏమా అందం భామా నీకు భువితో ఏమి సంబంధం.. ఏ మానవుడు చూడనే లేదే ఈ సొగసే ఇలకే ఓ గ్రంధం’ అంటూ చక్కటి భావాలతో ఈ పాట సాగింది. సినిమా చిత్రీకరణ పూర్తయిందని, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నామని చిత్ర బృందం పేర్కొంది. నాజర్, వెన్నెల కిశోర్, షాయాజీ షిండే, సుహాసినీ మణిరత్నం, శ్రీకాంత్, కిరణ్ అయ్యంగార్, అన్నపూర్ణమ్మ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ అరవింద్ కుమార్ రవివర్మ సినిమాటోగ్రాఫర్‌గా కూడా పనిచేస్తుండటం విశేషం.