కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటించిన చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. విజయశాంతి కీలక పాత్ర పోషించారు. ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు. ఇది పూర్తిగా కల్యాణ్‌రామ్ కోసమే తయారు చేయించుకున్న కథ. తల్లి పాత్ర కథలో కీలకం. ఆ పాత్రను విజయశాంతిగారితో చేయించాలని ముందే ఫిక్సయ్యాం. అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకొని చేసిన ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్ ఇది అని అన్నారు.

దర్శకుడు ప్రదీప్‌తో ఓ వెబ్ ఫిల్మ్ చేశామనీ, తను కమర్షియల్ మీటర్ తెలిసిన దర్శకుడని, తమ నమ్మకాన్ని నిజం చేస్తూ అద్భుతంగా ఈ సినిమా తీశాడని నిర్మాతలు తెలిపారు. విజయశాంతి పోషించిన వైజయంతి పాత్ర కర్తవ్యం సినిమా స్ఫూర్తితో తీర్చిదిద్దబడిందనీ, కథ వినగానే చిన్నచిన్న మార్పులతో సింగిల్ సిట్టింగ్‌లో ఆమె ఓకే చేశారనీ, కల్యాణ్‌రామ్, విజయశాంతిల పాత్రలు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయని నిర్మాతలు చెప్పారు.

కథను నమ్మి, కథకు కావాల్సింది మాత్రమే ఖర్చు చేశామనీ, తాము పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుందనీ, కచ్ఛితంగా మేం అనుకున్న దానికంటే గొప్ప స్పందన వస్తుందని నమ్మకంతో ఉన్నామనీ నిర్మాతలు ఆశాభావం వెలిబుచ్చారు. ఈ సినిమా తొలి ప్రేక్షకుడు ఎన్టీఆరే. సినిమా చూసి ఎమోషన్స్, యాక్షన్ అంశాలు బాగా కుదిరాయని అభినందించారు. ఆర్‌ఆర్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కావొద్దని చెప్పారు. అందుకు తగ్గట్టే అజనీష్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ చెప్పినట్టు సినిమా చివరి 20 నిమిషాలు కళ్లు చెమ్మగిల్లేలా వుంటుంది. ఈ సినిమాలో మూడు ఎపిసోడ్స్ ది బెస్ట్‌గా ఉంటాయి ఆ మూడూ సెకండాఫ్‌లో వస్తాయ్ అని పేర్కొన్నారు.
