సుహాస్ హీరోగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ప్రసన్నవదనం. పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ కథానాయికలు. అర్జున్ వై.కె దర్శకుడు. జేఎస్ మణికంఠ, టి.ఆర్.ప్రసాద్‌రెడ్డి నిర్మాతలు. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్, ప్రీరిలీజ్ ఈవెంట్ కలిపి హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా దర్శకుడు సుకుమార్, దర్శకులు బుచ్చిబాబు సాన, కార్తీక్ దండులతో పాటు నటుడు అవసరాల శ్రీనివాస్, కథానాయి కలు రాశీసింగ్, పాయిల్ రాధాకృష్ఱ, నిర్మాత మణికంఠ, ప్రసాదరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ సుహాస్ అంటే నాకూ, బన్నీకీ చాలా ఇష్టం. పుష్ప లో హీరో ఫ్రెండ్ కేశవ కేరక్టర్‌కి ముందు సుహాస్‌నే అనుకున్నాం. కానీ అప్పటికే తను హీరో అయిపోయాడు. దాతో కుదర్లేదు. హీరో నానిలా సుహాస్ కూడా సహజ నటుడు. భవిష్యత్తులో తను కూడా నాని అంత ఎదుగుతాడనిపిస్తుంది అని అన్నారు. ఈ సినిమా చూశాను. ఏ కరక్షన్ చెప్పలేకపోయాను. అంత చక్కగా తీశాడు దర్శకుడు అర్జున్. జగడం టైమ్‌లో తను నన్ను కలిశాడు. నా దగ్గర పనిచేయాలనే కోరికను వ్యక్తం చేశాడు.నా టీమ్‌లోకి తీసుకున్నాను. కలిసి పనిచేశాక అతని పనితనం తెలిసింది. 100 పర్సంట్ లవ్ సినిమా కథను అతనితోనే కలిసి 23రోజుల్లో రాశాను. లాజిక్ తెలిసిన దర్శకుడు తను. హాలీవుడ్‌లో ఉండివుంటే మరోస్థాయి సినిమా తీసేవాడు. ఈ సినిమా కూడా అద్భుతంగా తీశాడు. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది అని నమ్మకం వ్యక్తం చేశారు.
తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని, ప్రేక్షకులు థియేటర్ల దాకా వస్తే చాలు, మిగతాది మేం చూసుకుంటామనీ, కచ్చితంగా సినిమా అందరినీ నచ్చుతుందని హీరో సుహాస్ అన్నారు. నిర్మాతల సహకారంతో సినిమాను అనుకున్నదానికంటే గ్రాండ్‌గా చేశాం. సహకరించిన అందరికీ ధన్యవాదాలు అని దర్శకుడు చెప్పారు. మే 3న సినిమా విడుదల కానుంది.