ఆఫ్రికా దేశమైన కెన్యా లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ డ్యామ్ కూలి సుమారు 40 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు స్థానిక అధికారులు తాజాగా వెల్లడించారు. కెన్యాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఫలితంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. దేశంలోని పలు ప్రధాన డ్యామ్‌లు, నదులు నిండి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. నీటి ఉద్ధృతికి పలు డ్యామ్‌లు కూడా కొట్టుకుపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా పశ్చిమ కెన్యాలోని రిఫ్ట్ వ్యాలీ లో గల కిజాబె డ్యామ్ నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయింది. దీంతో ఆ నీరంతా దిగువ గ్రామాల్లోకి పోటెత్తడంతో సుమారు 42 మంది నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి మరణించినట్లు నకురు కౌంటీ గవర్నర్ సుసాన్ కిహికా తెలిపారు. నీటి ఉద్ధృతికి పలు ఇళ్లు, రోడ్లు కూడా కొట్టుకుపోయాయని, బుదరలో మరికొంత మంది చిక్కుకుపోయినట్లు చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.