జగపతిబాబు, ఆశిష్‌గాంధీ, మమతా మోహన్‌దాస్, విమలా రామన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం రుద్రంగి. అజయ్ సామ్రాట్ దర్శకత్వం. ఈ చిత్రాన్ని ఎమ్మెల్యే, డాక్టర్ రసమయి బాలకిషన్ నిర్మించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటుడు బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడమే నా దృష్టిలో నిజమైన నటన. నటించడం కాదు పాత్రలో జీవించడం గొప్ప. సినిమాలు బాగా ఆడితేనే పరిశ్రమ వర్థిల్లుతుంది. అభిరుచి కలిగిన నిర్మాతల వల్ల్లే ఈ రోజు తెలుగు చిత్రసీమ బతికి బట్టకడుతున్నది. రుద్రంగి సినిమాకు మంచి నటీనటులు కుదిరారు. ఈ రోజు తెలుగు చిత్రాలకు దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. దేశమంతా తెలుగు సినిమాను చూస్తున్నారు. తెలుగు సినిమాకు పోటీ ఎవరూలేరనే స్థాయికి మనం ఎదిగాం. తప్పకుండా ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు.
జగపతిబాబు మాట్లాడుతూ బాలకృష్ణగారిని ఈ వేడుకకు ఆహ్వానించాలని మూడు నెలలుగా అనుకుంటున్నా. నేను అడగ్గానే ఆయన అంగీకరించారు. భారీ బడ్జెట్ అవసరం అవుతుంది కాబట్టి తొలుత ఈ సినిమా నేను చేయనని చెప్పాను. ‘లెజెండ్’ తర్వాత ఎనభైకి పైగా సినిమాలు చేసినా..అందులో పది మాత్రమే గొప్పగా చెప్పుకునేలా ఉన్నాయి. అందులో రుద్రంగి ఒకటి అవుతుంది. ఈ సినిమా ద్వారా నాకు కొత్త లైఫ్ వస్తుందన్న నమ్మకం ఉంది. తెలంగాణ ప్రేక్షకులందరూ ఈ సినిమాను ఆశీర్వదించాలని కోరుకుంటున్నా అన్నారు.
రసమయి బాలకిషన్ మాట్లాడుతూ బాలకృష్ణగారు ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడమే పెద్ద విజయంగా భావిస్తున్నా. ఇల్లంతకుంటలో వీరసింహా రెడ్డి సినిమా షూటింగ్ జరిగింది. పెద్ద హీరో షూటింగ్ అంటే ఎంత ఆర్భాటంగా ఉంటుందో అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్లినప్పుడు బాలకృష్ణగారు నిరాడంబరంగా ఉన్నారు. అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ కనిపించారు. బాలకృష్ణగారిని అభిమానులు ఎందుకు అంతగా ప్రేమిస్తారో ఆ రోజు నాకు అర్థమైంది తెలంగాణ నేలకు, వారసత్వానికి గొప్ప పోరాట నేపథ్యం ఉంది.ఆ పోరాటాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజెప్పాలని ఈ సినిమా తీశాను. నా పది సంవత్సరాల కల ఇది. జగపతిబాబుగారు ఒప్పుకోకపోతే ఈ సినిమా సాకారం అయ్యేది కాదు. భీమ్రావ్ పాత్రలో ఆయన అద్భుతంగా ఒదిగిపోయారు అన్నారు. జూలై 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ కార్యక్రమంలో ఆశిష్ గాంధీ, మమతా మోహన్ దాస్, గానవి లక్ష్మణ్, దివి, చరిష్మా చక్రి, నోఫల్ రాజా తదితరులు పాల్గొన్నారు.