ఇండియా, పాకిస్థాన్ మధ్య ఆపరేషన్ సింధూర్ సమయంలో ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఇండోపాక్ మధ్య శాంతి నెలకొల్పేందుకు మధ్యవర్తిత్వం వహించినట్లు చైనా చెప్పింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాన్నాళ్ల నుంచి ఇండోపాక్ యుద్ధాన్ని ఆపినట్లు చెబుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ట్రంప్ తరహాలోనే డ్రాగన్ దేశం చైనా కూడా ఆ కామెంట్ చేసింది. పెహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత పాకిస్థాన్‌పై భారత్ సైనిక చర్య చేపట్టింది. అయితే రెండు దేశాల డీజీఎంవోల చర్చల తర్వాతే ఆపరేషన్ సింధూర్‌ను నిలిపివేసినట్లు భారత్ పేర్కొన్నది. పాక్‌తో జరిగిన సమరంలో మూడవ దేశ పాత్ర లేదని చెప్పింది. కానీ ఇండోపాక్ మధ్య శాంతిని నెలకొల్పడంలో తాము కూడా పాత్ర పోషించినట్లు ఇప్పుడు చైనా చెప్పడం గమనార్హం.

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంక్షోభాలను పరిష్కరించేందుకు శాంతిదూత పాత్రను చైనా పోషించినట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యి పేర్కొన్నారు. ఇండోపాక్ యుద్ధమే కాదు మయన్మార్, కంబోడియా-థాయ్‌ల్యాండ్, ఇరాన్ న్యూక్లియర్ సమస్యను కూడా పరిష్కరించినట్లు చైనా మంత్రి చెప్పారు.















