
పదిహేను ఏండ్లలోపు పిల్లల సోషల్ మీడియా వాడకంపై ఫ్రాన్స్ త్వరలో నిషేధం విధించబోతున్నది. దేశవ్యాప్తంగా ఈ నిషేధాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్టు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తాజాగా వెల్లడించారు. మిడిల్ స్కూల్‌లో 14 ఏండ్ల ఓ విద్యార్థి స్కూల్ సిబ్బందిపై పదునైన ఆయుధంతో దాడికి పాల్పడిన ఘటన ఫ్రాన్స్‌లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే మాక్రాన్ నుంచి పై ప్రకటన వెలువడటం గమనార్హం. యువతలో హింసాత్మక ప్రవృత్తి పెంచడానికి సోషల్ మీడియా ఆజ్యం పోస్తున్నదని, పర్యవేక్షణ లేకుండా పిల్లల సోషల్ మీడియా వాడకం హానికరమని ఆయన అన్నారు.
