ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. దేశ, విదేశాల నుంచి ప్రత్యేక బహుమతులను తీసుకొస్తున్నారు. వాటిని రామాలయంలో ఉపయోగించాలని ఆకాంక్షిస్తున్నారు. శ్రీరాముని ధర్మపత్ని సీతమ్మ జన్మస్థలం నేపాల్‌లోని జనక్‌పూర్ నుంచి 3,000కుపైగా బహుమతులు అయోధ్యకు చేరుకున్నాయి. వెండి పాదుకలు, ఆభరణాలు, దుస్తులు వంటివి వీటిలో ఉన్నాయి. శ్రీలంక ప్రతినిధి బృందం ఆ దేశంలోని అశోక వాటిక నుంచి ఓ శిలను తీసుకొచ్చింది. గుజరాత్‌లోని వడోదర నివాసి విహా భర్వాడ్ 108 అడుగుల పొడవు, 3.5 అడుగుల వెడల్పుగల అగరుబత్తీని తయారు చేశారు. దీని బరువు 3,610 కేజీలు ఉన్నట్లు తెలిపారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి 44 అడుగుల పొడవైన కంచు ధ్వజ స్తంభం, మరో ఆరు చిన్న ధ్వజ స్తంభాలను తీసుకుని ఓ బృందం గత వారం బయల్దేరింది.
హైదరాబాద్‌కు చెందిన చల్లా శ్రీనివాస శాస్త్రి (64) తన తండ్రి కలను నెరవేర్చడం కోసం దాదాపు 8,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, బంగారు పూత పూసిన పాదుకలను బహూకరించేందుకు అయోధ్యకు చేరుకున్నారు. తన తండ్రి కరసేవకుడని ఆయన చెప్పారు. గుజరాత్‌లోని వడోదరకు చెందిన రైతు అరవింద్ భాయ్ మంగళ్ భాయ్ పటేల్ 1,100 కేజీల భారీ దీపాన్ని తయారు చేసి, బహూకరించారు. దీనిని బంగారం, వెండి, రాగి, జింక్, ఇనుముతో తయారు చేయించారు.