సెప్టెంబరు నుంచి దేశంలో జనగణన జరపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ఇద్దరు ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. దేశంలో ప్రతి పదేండ్లకు ఒకసారి జనగణన జరుగుతున్నది. ఈ లెక్కన 2021లో జరగాల్సి ఉన్నప్పటికీ కొవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత మహ మ్మారి ప్రభావం తగ్గినప్పటికీ జనగణనపై కేంద్రం దృష్టి సారించలేదు. దీంతో ప్రభుత్వంపై అనేక విమర్శలు వచ్చాయి. జనగణన జరగకపోవడం వల్ల ఆర్థిక డాటా, ద్రవ్యోల్బణం, ఉద్యోగాలకు సంబంధించిన సమాచార నాణ్యతపై ప్రభావం పడుతున్నదని పలువురు ఆర్థికవేత్తలు కూడా పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ లెక్కలన్నీ 2011 జనాభా లెక్కల ఆధారంగా చేస్తూ రావడం వల్ల దేశంలో అసలైన పరిస్థితులు ప్రతిబింబించడం లేదని అభిప్రాయపడ్డారు. దీంతో ఎట్టకేలకు వచ్చే నెల నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించనున్నట్టు సమాచారం.