విమాన ప్రయాణికులకు శుభవార్త. ఏప్రిల్ 20 నుంచి అన్ని విమానాల్లో 60 శాతం సీట్లపై ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయరాదని అన్ని విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశించింది. ఈ మేరకు ఎయిర్‌లైన్స్‌కు ఉత్తర్వులు జారీచేసింది. ఇవి ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.

విమానాల్లో కనీసం 60 శాతం సీట్లను ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా కేటాయించాలని ఈ నెల 18న డీజీసీఏకు పౌర విమానయాన శాఖ సూచించింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 20న డీజీసీఏ విమానయాన సంస్థలకు సవరించిన ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్క్యులర్‌ను జారీచేసింది. అలాగే ఒకే పీఎన్ఆర్పై ప్రయాణించే వారికి సాధ్యమైనంత వరకు పక్క పక్క సీట్లను కేటాయించాలని విమానయాన సంస్థలకు డీజీసీఏ సూచించింది.















