కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి సీన్ ఫ్రేజర్ కీలక ప్రకటన చేశారు. పది వేల మంది హెచ్-1బీ వీసాదారులకు తమ దేశంలో వర్క్ పర్మిట్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. వీసాదారులకు చెందిన కుటుంబాలకు కూడా కెనడా ఇమ్మిగ్రేషన్ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. హెచ్-1బీ వీసా ఉన్న వారి కుటుంబీకులు కెనడాలో చదువుకునే, ఉద్యోగం చేసే అవకాశాన్ని కూడా కల్పించారు.
అమెరికాలోని హైటెక్ కంపెనీల్లో వేలాది మంది వర్కర్లు పనిచేస్తన్నారని, వాళ్లు కెనడాలోనూ విధులు నిర్వర్తిస్తుంటారని, అయితే హెచ్-1బీ వీసా ఉన్న వారు తమ దేశానికి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని కెనడా చెప్పింది. కుటుంబసభ్యులతో పాటు ఆ వీసాదారులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు అని తెలిపింది. అనుమతి పొందిన ఉద్యోగులు మూడేళ్ల పాటు తమ వద్ద వర్క్ చేసుకోవచ్చు అని కెనడా పేర్కొన్నది. హెచ్-1బీ వీసాదారుల కుటుంబసభ్యులు తాత్కాలిక రెసిడెంట్ వీసా పొందవచ్చు అని ప్రకటనలో తెలిపారు. అయితే ఎవరు అర్హులు అవుతారు, ఎంత మందిని అనుమతిస్తారన్న దానిపై ఇమ్మిగ్రేషన్ మంత్రి క్లారిటీ ఇవ్వలేదు.
ఏటా అమెరికా ప్రభుత్వం 65,000 హెచ్ 1 బీ వీసాలను జారీ చేస్తోంది. ఈ వీసాల గడువు మూడేళ్లు. మరో మూడేళ్లు వీటిని రెన్యువల్ చేసుకోవచ్చు. 2022 ఆర్థిక సంవత్సరంలో ఆమోదం పొందిన హెచ్1 బీ వీసా దరఖాస్తుల్లో 72.6 శాతం భారతీయులవే .