మహాభారత కాలంలో శ్రీకృష్ణ భగవానుడు నిర్మించిన ద్వారక నగరాన్ని దర్శించేందుకు ద్వారకా సబ్‌మెరైన్ టూరిజం ప్రాజెక్టును చేపడుతున్నట్టు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. అరేబియా సముద్రంలో మునిగిపో యిన ఈ సుందర నగరాన్ని వీక్షించేందుకు భక్తులను జలాంతర్గాముల్లో తీసుకెళ్లనున్నట్టు తెలిపింది. వచ్చే ఏడాది క్రిష్ణ జన్మాష్టమి లేదా దీపావళి సందర్భంగా సబ్‌మెరైన్ యాత్ర ప్రారంభమవు తుందని వెల్లడించింది. పర్యాటకులను సబ్‌మెరైన్లలో తీసుకెళ్లటం దేశ పర్యాటకంలో ఇదే మొదటిసారిగా ప్రభుత్వం పేర్కొన్నది.
అరేబియా సముద్రంలో 300 అడుగుల లోతులో ఉన్న ఆనాటి ద్వారకా నగర కట్టడాలు, పురాతన ఆలయా లను సబ్‌మెరైన్ నుంచి భక్తులు తిలకించవచ్చని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం రెండు గంటల దర్శన యాత్రను నిర్వహించనున్నామని పేర్కొన్నది. దీనికి సంబంధించి మజ్‌గావ్ డాక్ షిప్‌యార్డ్ కంపెనీతో గుజరాత్ టూరిజం శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. రెండు గంటలపాటు సబ్‌మెరైన్ యాత్ర ఉంటుంది. 300 అడుగుల లోతుకు వెళ్లి, ఆనాటి ద్వారకను కనులారా చూసి రావొచ్చు. ఒక ట్రిప్‌లో 24 మంది పర్యాటకులకు తీసుకెళ్తాం. అందులో ఆరుగురు సిబ్బంది ఉంటారు అని గుజరాత్ టూరిజం శాఖ తెలిపింది.