తెలుగు సినిమాకి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిన లెజెండ్, నటశేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ. మొదటి స్టీరియో సౌండ్, మొదటి సినిమా స్కోప్, మొదటి, 70 మీ.మీ మొదటి జేమ్స్ బాండ్, మొదటి కౌబోయ్ ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచిన కథానాయకుడి జయంతి (మే 31). సూపర్ స్టార్ కృష్ణగారి జయంతిని పురస్కరించుకుని ఆయన అభిమానులు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ముఖ్య అతిధి గా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సూపర్ స్టార్ కృష్ణ పర్సనల్ మేకప్ మ్యాన్ మాధవరావుని, అలాగే కృష్ణ జీవిత చరిత్ర దేవుడు లాంటి మనిషి వ్రాసిన సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావుని అభిమానులు ఘనంగా సత్కరించారు. అనంతరం కృష్ణగారి జయంతిని పురస్కరించుకుని ఆయన నటించిన మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని సరికొత్త హంగులతో రీ రిలీజ్ చేస్తున్నట్లుగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ఇది కృష్ణగారి 81వ పుట్టినరోజు. ఆయన ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఈ పుట్టినరోజును చేసుకునే వాళ్లం. ఇప్పుడు జయంతి జరుపుకుంటున్నాం. ఆయన మన మధ్య లేనప్పటికీ, సినిమాలతోనూ, వ్యక్తిత్వంతోనూ ఎప్పుడూ మన మధ్యనే ఉంటారు అని అన్నారు.

కృష్ణగారి పర్సనల్ మేకప్ మ్యాన్ మాధవరావు మాట్లాడుతూ మే 31న కృష్ణగారి పుట్టినరోజును ఆయన ఎక్కడ ఉన్నా కూడా కనుల పండుగగా చేసుకునే వాళ్లం. ఫ్యాన్స్ అందరికీ ఆ రోజు పండగే. ఆయన బర్త్‌డే కాదు ఇది, కృష్ణగారి పండుగ. ఆయన ఆత్మ ఎక్కడున్నా కూడా శాంతియుతంగా ఉండాలని, సినిమా పరిశ్రమ ఉన్నంతకాలం ఆయన బతికే ఉంటారని తెలుపుతూ కృష్ణగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు మాట్లాడుతూ మే 31న కృష్ణగారు ఊటీలో ఉన్నా కూడా ఫ్యాన్స్ వెళ్లి పుట్టినరోజు వేడుకను జరిపేవారు. ఆయన లేకుండా జరుగుతున్న మొట్టమొదటి జయంతి ఇది. అభిమానులు కలకాలం గుర్తుంచుకునేలా ఆయన పుట్టినరోజును సెలబ్రేట్ చేసిన సిరాజ్‌గారికి, ఖాదర్ ఘోరీగారికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్ కృష్ణగారి డైహార్డ్ ఫ్యాన్స్ ఎందరో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కృష్ణగారి వీరాభిమానులు సిరాజ్, అల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజా సేన అధ్యక్షులు ఖాదర్ ఘోరీ దగ్గరుండి నడిపించారు.
