తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ( టీటీఏ) మెగా కన్వెన్షన్ ఘనంగా ప్రారంభమైంది. కన్వెన్షన్ మొదటి రోజైన బాంక్వెట్ డిన్నర్ విజయవంతంగా కాగా, కన్వెన్షన్ రెండో రోజులో భాగంగా నిర్వహించిన కార్యక్రమాలు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టాయి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తూ నిర్వహించిన ఇండియా డే పెరేడ్ భిన్నత్వంలో ఏకత్వాన్ని మరోసారి తెలియజపరిచింది. బోనాలు, బతుకమ్మ పోతురాజుతో టీటీఏ మహిళలు, నాయకులు ఊరేగింపుగా కన్వెన్షన్ ఇనాగరల్‌కి విచ్చేశారు. గణపతిని స్మరించుకుంటూ క్లాసికల్ డాన్స్ ప్రదర్శనతో వేదికపై తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ కన్వెన్షన్ రెండో రోజు కార్యక్రమాలను ప్రారంభించారు. అమెరికా, భారతదేశం జాతీయ గీతాలతోపాటు, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు.

వ్యాఖ్యాతలు రవి, దీప్తి టీటీఏ కార్యవర్గాన్ని వేదిక పైకి ఆహ్వానించి టీటీఏ ప్రస్థానంపై వీడియో ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి, ప్రస్తుత శాసన సభ్యులు చామకూర మల్లారెడ్డి సమక్షంలో జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ సందర్భంగా టీటీఏ అధ్యక్షులు వంశీ రెడ్డి కంచరకుంట్ల, వ్యవస్థాపకులు డా.పైళ్ల మల్లారెడ్డి, అడ్వైజరీ కౌన్సిల్ చైర్ డా. విజయపాల్ రెడ్డి, కోచైర్ డా.మోహన్ రెడ్డి పటలోళ్ళ, సభ్యులు భరత్ రెడ్డి మాదాడి ఆహ్వానితులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగించారు.


సాయంత్రం మెయిన్ స్టేజీపై సాంస్కృతిక కార్యక్రమాల మధ్యలో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాలు అమ్ముకున్న , పూలు అమ్ముకున్న, ఇంతటి స్థాయికి వచ్చా అంటూ, ఇన్స్పైరింగ్ గా చేసిన మాస్ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. అందరూ నవ్వుతూ కరతాళ ధ్వనులతో స్వాగతించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జడ్చర్ల ఎమ్మెల్యే అమృత్ రెడ్డి ప్రసంగించారు. వీరిని టీటీఏ నాయకత్వం సన్మానించింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తిరుపతి నుండి తెచ్చిన శాలువాలతో తెలంగాణ ప్రభుత్వం తరపున అంటూ టీటీఏ నాయకులను సన్మానించారు.


టాలీవుడ్ హీరోయిన్స్ శ్రీలీల, మెహ్రీన్‌లను వేదికపై ఆహ్వానించి, ప్రసంగాల అనంతరం సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీలీల కుర్చీ మడతపెట్టి సాంగ్ కి డాన్స్ చేసి అలరించారు. యాంకర్స్ సుమ, రవి విట్టి యాంకరింగ్‌తో ఆకట్టుకున్నారు. లంచ్, డిన్నర్ మెన్యూ బాగుంది. డా.హరనాథ్ పోలిచెర్ల చేసిన సేవలకు గాను టీటీఏ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందజేశారు. చివరిగా హైదరాబాద్ నుండి వచ్చిన త్రీయరీ బ్యాండ్ వారు లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ తో టీటీఏ కన్వెన్షన్ రెండో రోజుకి ఘనమైన ముగింపు పలికారు.



