హీరో మహేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. మహేష్‌బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్స్, గ్లింప్స్‌కు మంచి స్పందన లభించింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతున్నది. ఇంటర్వెల్ ఎపిసోడ్‌కు సంబంధించిన భారీ యాక్షన్ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారని తెలిసింది. ఈ ఎపిసోడ్ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. అందరి అంచనాలను అందుకునేలా ఈ సినిమా విషయంలో దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది.
