ఏగన్, కోర్ట్ ఫేమ్ శ్రీదేవి, ఫెమినా జార్జ్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం హైకూ. ఈ చిత్రాన్ని విజన్ సినిమా హౌస్ పతాకంపై డా.డి.అరుళానందు, మాథ్యూ అరుళానందు నిర్మిస్తున్నారు. యువరాజ్ చిన్నసామి అత్యంత ప్రతిభావంతంగా రచన చేసి దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో ఏగన్ మాట్లాడుతూ పదేళ్ల నుంచి తనతో ఉన్న పరిచయంతో దర్శకుడు యువరాజ్ చిన్నసామి ఈ కథను ఎంతో కష్టపడి తెరకెక్కించారని తెలిపారు. సిద్దు కుమార్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్గా నిలుస్తుందని, సినిమా విజయంపై తమ యూనిట్ అంతా 200 శాతం నమ్మకంతో ఉన్నామని, త్వరలోనే సక్సెస్ మీట్లో కలుస్తామని ఉత్సాహం వ్యక్తం చేశారు.

ఈ రొమాంటిక్ డ్రామాపై ప్రముఖ రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించారు. షూటింగ్ ప్రారంభించడానికి ముందే ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్కు విక్రయించడం విశేషమని, ఈ కథ వారిని ఎంతగానో ఆకట్టుకుందనడానికి ఇదే నిదర్శనమని ఆయన కొనియాడారు. ట్రైలర్ చూసినప్పుడే సినిమా ఎంత కూల్గా, ఆహ్లాదకరంగా ఉంటుందో అర్థమైందని తెలిపారు. ప్రతి ఒక్కరినీ మళ్లీ కాలేజీ రోజుల్లోకి తీసుకువెళ్లే అద్భుతమైన సిన్సియర్ లవ్ స్టోరి ఇదని, శ్రీదేవి నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని కోన వెంకట్ పేర్కొన్నారు.

డైరెక్టర్ రామ్ జగదీశ్ మాట్లాడుతూ శ్రీదేవి తన కళ్లతోనే హావభావాలను పలికించగల నటి అని, ఈ చిత్రం ద్వారా ఆమె నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుందని అన్నారు. ఈ చిత్రంలో లవ్ అండ్ రిలేషన్షిప్లో ఉండే సున్నితమైన అంశాలను, చిన్న చిన్న కష్టాలను చాలా సహజంగా తెరకెక్కించినట్లు నటి శ్రీదేవి తెలిపారు.















