గత 15 నెలలుగా ఇజ్రాయెల్-హమాస్ ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న యుద్ధానికి తెరపడింది. ఇరు వర్గాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్టు మధ్యవర్తులు ప్రకటించారు. కొన్ని వారాల క్రితం నుంచి ఖతార్ రాజధానిలో ఎడతెరపి లేకుండా జరిగిన చర్చల అనంతరం ఈ కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని తెలిపారు. దీనిలో భాగంగా హమాస్ చేతిలో ఉన్న డజన్ల కొద్దీ బందీలను విడతల వారీగా విడుదల చేస్తారు.
అలాగే ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న వందలాది పాలస్తీనా ఖైదీలను ఆ దేశం విడుదల చేస్తుంది. అలాగే గాజా యుద్ధం కారణంగా దేశం విడిచిపోయిన వేలాది మంది తమ ఇళ్లకు తిరిగి రావడానికి ఇజ్రాయెల్ అంగీకరించింది. అలాగే యుద్ధం కారణంగా ధ్వంసమైన ప్రాంతాలకు మానవతా దృష్టితో సాయం అందజేస్తుంది. ఒప్పందం జరిగిన విషయా న్ని ముగ్గురు అమెరికా అధికారులు, ఒక హమాస్ ప్రతినిధి నిర్ధారించగా, పూర్తి వివరాలు రావాల్సి ఉందని ఇజ్రాయెల్ సీనియర్ అధికారి తెలిపారు.