మహారాష్ట్ర ముఖ్యమంత్రి అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుత అసెంబ్లీ గడువు నేటితో ముగియనుంది. ఇప్పటి వరకూ సీఎం ఎవరన్నదానిపై స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో శివసేన (యూటీబీ) నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కావొచ్చని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్ణయి స్తారు. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ఇద్దరూ తమ పార్టీల కోసం సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరు. ఈ రెండు పార్టీలు మోదీ, షా కనుసన్నల్లోనే నడుస్తాయి. ప్రస్తుతం బీజేపీకే అధిక మెజారిటీ ఉంది. కాబట్టి షిండే, పవార్ కు సీఎం అయ్యే అవకాశం లేదు. నా అభిప్రాయం ప్రకారం మహా తదుపరి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కావొచ్చు అని రౌత్ అభిప్రాయం వ్యక్తం చేశారు.