తనను తాను శాంతి దూతగా ప్రకటించుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై మండిపడ్డారు. ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం చేసుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా పుతిన్ తీరు మారకపోవడంతో కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్టు ఆయన తెలిపారు. శాంతి ఒప్పందానికి 50 రోజుల గడువు ఇచ్చిన ట్రంప్ తాజాగా 12 రోజుల డెడ్‌లైన్ విధిస్తున్నట్టు పేర్కొన్నారు.

పుతిన్ తీరుతో తీవ్ర నిరాశ చెందాను. ఆయన చాలా అందంగా మాట్లాడతారు. కానీ, రాత్రి పూట మాత్రం జనాలపై బాంబులతో దాడికి దిగుతారు. అందుకే, ఇంతకుముందు ఆయనకు ఇచ్చిన 50 రోజుల గడువును కుదిస్తున్నా. వచ్చే 10 లేదా 12 రోజుల్లో పుతిన్ రాజీకి రావాలి. లేదంటే సెకండరీ ఆంక్షల్ని ఎదుర్కోక తప్పదు. వంద శాతం చెబుతున్నా ఈ నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ విషయాన్ని నేను ఈ రోజు రాత్రి లేదా రేపు అధికారిక ప్రకటనతో వెల్లడిస్తాను అని ట్రంప్ రష్యా అధ్యక్షుడిని హెచ్చరించారు.
















