ఈ ఏడాదిలో(2024) ప్రపంచ జనాభా 7.1 కోట్లు పెరిగి కొత్త సంవత్సరం నాటికి 809 కోట్లకు చేరుకుంటుందని అమెరికా జనాభా బ్యూరో నివేదిక అంచనా వేసింది. 2023తో పోలిస్తే 2024లో జనాభా పెరుగుదల స్వల్పంగా తగ్గి 0.9 శాతంగా నమోదైంది. 2025 జనవరిలో ప్రపంచ జనాభా 7.5 కోట్లు పెరుగుతుందని, ప్రతి సెకనుకు 4.2 జననాలు, 2.0 మరణాలు ప్రపంచవ్యాప్తంగా నమోదవుతాయని నివేదిక అంచనా వేసింది. 2024లో అమెరికా జనాభా 26 లక్షలు పెరుగింది. కొత్త సంవత్సరం నాటికి అమెరికా జనాభా 34.1 కోట్లకు చేరుతుందని సెన్సస్ బ్యూరో అంచనా వేసింది. 2025 జనవరిలో అమెరికాలో ప్రతి 9 సెకండ్లకు ఒక జననం, ప్రతి 9.4 సెకండ్లకు ఒక మరణం ఉంటుందని అంచనా. ప్రతి 23.2 సెకండ్లకు అమెరికా జనాభాకు ఒక అంతర్జాతీయ వలస జత అవుతుందని నివేదిక తెలిపింది.
జననాలు, మరణాలు, అంతర్జాతీయ వలసలు అన్నీ కలిపి అమెరికా జనాభాలో ప్రతి 21.2 సెకండ్లకు ఒక వ్యక్తి పెరుగుదల ఉంటుందని పేర్కొన్నది. 2020 దశకంలో అమెరికా జనాభా దాదాపు 97 లక్షలు పెరిగింది. పెరుగుదల రేటు 2.9 శాతంగా ఉంది. 2010 దశకంలో అమెరికా జనాభా పెరుగుదల 7.4 శాతం ఉంది. 1930 దశకం తర్వాత ఇదే అత్యంత తక్కువ శాతం పెరుగుదల.