అగ్రరాజ్యం అమెరికా, యూరోపియన్ యూనియన్ (27 సభ్య దేశాలు) మధ్య భారీ వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఈయూతో భారీ వాణిజ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. స్కాట్‌లాండ్‌లోని తన గోల్ఫ్ రిసార్ట్‌లో ఈయూ ప్రెసిడెంట్ అర్సులా వాన్ డెర్ లెయన్ తో ట్రంప్ చర్చలు జరిపారు. ఈ భేటీలో వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఈయూ నుంచి అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై కనీస సుంకాన్ని 15 శాతంగా నిర్ణయించామని తెలిపారు.

అమెరికాలో 600బిలియన్ల డాలర్ల అదనపు పెట్టుబడులు, 750 బిలియన్ల విలువైన కొనుగోళ్లకు ఐరోపా యూనియన్ హామీ ఇచ్చిందని ప్రకటించారు. ఇది ఇరుదేశాలూ లబ్ధి చేకూర్చే ఒప్పందం అని, గతంలో ఎన్నడూ చూడని భారీ వాణిజ్య ఒప్పందమని ట్రంప్ పేర్కొన్నారు. ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా కూడా అమెరికాతో మంచి ఒప్పందం కుదిరినట్టు చెప్పారు. అమెరికా నుంచి ఎల్ఎన్‌జీ, చమురు, అణు ఇంధనాన్ని కొనుగోలు చేస్తామని అన్నారు. రాబోయే మూడేళ్లల్లో ఈ కొనుగోళ్లు ఉంటాయని చెప్పారు. రష్యా ఇంధనాల నుంచి ఇతర వనరులపై మళ్లే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.















