జమ్మూ కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పహల్గాంలో ఉగ్రవాదులు దాడి జరిపిన విషయం తెలిసిందే. ఈ నరమేధంలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో కశ్మీర్‌లోయతోపాటు దేశంమొత్తం భగ్గుమంది. ఈ ఘటన అనంతరం పాకిస్థాన్‌కి చెందిన నటులపై మళ్లీ వ్యతిరేకత మొదలైంది. తాజాగా ప్రభాస్ నటిస్తున్న ఒక ప్రాజెక్ట్‌లో ఇమాన్ ఎస్మాయిల్ అనే హీరోయిన్ నటిస్తుండగా, ఇమాన్ పాకిస్థాన్‌కి చెందిన నటి అని, ఆమెను మూవీ నుంచి తొలగించాలని విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ ఘటనపై ఇమాన్ ఎస్మాయిల్ స్పందించింది. తాను పాకిస్థాన్‌కి చెందిన అమ్మాయిని కాదని, తాను ఇండో అమెరికన్ అని పేర్కొన్నారు.

పహల్గాంలో జరిగిన విషాద సంఘటనకు సంబంధించి నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారందరికీ నా ప్రగాఢ సానుభూతి. అమాయక ప్రాణాల నష్టం ఎంతో బాధాకరం. ఈ ఘటన నా హృదయాన్ని కలచివేసింది. హింసాత్మక చర్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కళ ద్వారా వెలుగు, ప్రేమను పంచడమే నా లక్ష్యంగా ఉన్నందున, మనమందరం ఒకేతాటిపైకి వచ్చే రోజు త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాను.

రీసెంట్‌గా నేను పాకిస్థాన్‌కి చెందిన నటిని అంటూ వస్తున్న వార్తలు వైరలవుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై నేను క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. నేను కానీ నా కుటుంబం కానీ పాకిస్తాన్ సైన్యంతో సంబంధం కలిగి లేరు. నేను హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ మాట్లాడే గర్వించదగిన భారతీయ అమెరికన్‌ని. నా తల్లిదండ్రులు యుక్త వయసులో చట్టబద్ధంగా యునైటెడ్ స్టేట్స్‌కు వలస వచ్చిన తర్వాత నేను కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో జన్మించాను. వారు అనంతరం అమెరికన్ పౌరులుగా మారారు. అమెరికాలో నా విశ్వవిద్యాలయ విద్యను పూర్తి చేసిన తర్వాత, నేను నటిగా, కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు సాధించాను. ఈ గుర్తింపు అనంతరం నాకు ఇండియన్ సినిమాలలో ఛాన్స్ రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని పేర్కొన్నారు.
