వెంకటేష్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తున్నది. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి పాత్రికేయు లతో మాట్లాడింది. పోలీస్ క్యారెక్టర్‌లో నటించాలన్నది నా డ్రీమ్. ఎప్పటి నుంచో అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి పాత్ర లభించడం ఆనందంగా ఉంది. తాను ఇప్పటివరకు కామెడీ జోనర్ సినిమా చేయలేదని, తొలిసారి ఈ తరహా పాత్రలో నటించడం కొత్త అనుభూతినిచ్చిందని తెలిపింది. ఇందులో తాను యాక్షన్ సీక్వెన్స్ కూడా చేశానని, ఆ ఎపిసోడ్స్‌ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పింది.
పోలీస్ పాత్ర కోసం ఎలాంటి రిఫరెన్స్ తీసుకోలేదు. మా నాన్న ఆర్మీ ఆఫీసర్ కాబట్టి వారి బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ మీద అవగాహన ఉంది. నేను కూడా లేడీ పోలీసుల తాలూకు కొన్ని విషయాలను సేకరించాను అని చెప్పింది. వెంకటేష్ వంటి సీనియర్ నటుడితో కలిసి నటించడం ఆనందంగా ఉందని, ఆయన ఎప్పుడూ ప్రశాంతగా కనిపిస్తా రని, కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుందని మీనాక్షి చౌదరి పేర్కొంది. గత ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం తో ప్రేక్షకుల్ని పలకరించానని, ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం లో భాగమయ్యానని, ఈ పండగ తనకు కలిసొచ్చిందని ఆనందం వ్యక్తం చేసింది.