79వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ఫీనిక్స్ ఫాండేషన్, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్తం గా మెగాబ్లడ్ డొనేషన్ డ్రైవ్‌ను ప్రారంభించాయి. ఈ కార్యక్రమంలో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువ హీరో తేజ సజ్జా, కథానాయిక సంయుక్తమీనన్ అతిథులుగా హాజరయ్యారు. బుధవారం నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో 800 మంది వరకు పాల్గొన్నారని, సేకరించిన రక్తాన్ని భారత సైన్యానికి విరాళంగా అందించబోతున్నామని నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ రక్తదానం అనగానే నా పేరు గుర్తుకురావడం పూర్వజన్మ పుణ్యఫలంగా భావిస్తున్నా. సోషల్‌మీడియాలో వచ్చే విమర్శలపై మీరెందుకు స్పందించరని చాలా మంది అడుగుతుంటారు. అలాంటి అనవసర విషయాలపై నేనెప్పుడూ స్పందించను. ఎందుకంటే నేను చేపట్టిన సామాజిక కార్యక్రమాలు, నా పై అభిమానులు చూపించే ప్రేమే నాకు రక్షణ కవచాలుగా భావిస్తాను. నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. నా మంచి తనమే మాట్లాడుతుంది. రక్తదానం వంటి మంచి కార్యక్రమాలు ఎవరు చేసినా నన్ను పిలిస్తే తప్పకుండా వచ్చి మద్దతునిస్తాను అన్నారు.
















