కృతిశెట్టి, శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కృతిశెట్టి మాట్లాడుతూ జయాపజయాల గురించి పెద్దగా ఆలోచించను. మనచేతిలో లేని విషయాల గురించి పట్టించుకోకపోవడమే బెటర్ అనుకుంటా అని చెప్పింది. ఈ సినిమాలో నా పాత్ర పేరు సుభద్ర. తను ప్రతి విషయంలో క్రమశిక్షణతో ఉంటుంది. నేను ఇప్పటివరకు చలాకీగా, సున్నితమనస్కురాలైన అమ్మాయి పాత్రల్లోనే ఎక్కువగా నటించాను. కానీ అందుకు భిన్నంగా మనమే లో నా పాత్ర కొత్త కోణంలో సాగుతుంది. ఈ కథలో హార్ట్‌టచింగ్ ఎమోషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే యూనివర్సల్ కాన్సెప్ట్ ఇది. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండే అనుబంధం హృద్యంగా అనిపిస్తుంది అని చెప్పింది.
తన డ్రీమ్ రోల్ గురించి మాట్లాడుతూ బాహుబలి సినిమాలో అనుష్క తరహాలో ప్రిన్సెస్ పాత్రలు చేయడం చాలా ఇష్టం. అలాగే యాక్షన్, మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం ఉన్న రోల్స్ చేయాలని ఉంది అని తెలిపింది. ప్రస్తుతం తమిళ, మలయాళ భాషల్లో ఒక్కో సినిమా చేస్తున్నానని, ఫెయిల్యూర్స్ గురించి పెద్దగా ఆలోచించకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపైనే దృష్టిపెట్టానని కృతిశెట్టి పేర్కొంది. ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది.