నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్. బాబీ కొల్లి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించింది. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శ్రద్ధా శ్రీనాథ్ పాత్రికేయులతో సినిమా విశేషాలను పంచుకుంది. సినిమా ముఖ్యోద్దేశ్యం నటించి మెప్పించడం. తెరపై అందంగా కనిపించడం కాదు. అందుకే నేను గ్లామర్ కంటే అభినయప్రధాన పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తా. తక్కువ సినిమాలు చేసినా సరే నాణ్యమైన కథల్ని ఎంచుకోవాలన్నదే నా అభిమతం అని చెప్పింది.
ఈ సినిమాలో తాను నందిని అనే పాత్రలో కనిపిస్తానని, సున్నితమైన వ్యక్తిత్వం కలిగిన మహిళగా లోతైన భావోద్వేగా లతో తన క్యారెక్టర్‌ను తీర్చిదిద్దారని చెప్పింది. ఇప్పటి వరకు నేను విభిన్నమైన కథల్లో నటించా. అయితే డాకు మహారాజ్ పాత్రం ఓ పూర్తి ప్యాకేజీలా ఉంటుంది. కామెడీ, యాక్షన్, డ్రామా, ఎమోషన్స్ అన్నీ సమపాళ్లలో కుదిరాయి. ఈ సినిమాకు సొంతంగా డబ్బింగ్ చెప్పాను. సినిమా కథల ఎంపికలో చాలా సెలెక్టివ్‌గా ఉంటా. నటిగా నా బలం ఏమిటో బాగా తెలుసు. తెరపై అందాలొలికించే గ్లామర్ పాత్రల్లో కనిపించడం నాకు ఇష్టం ఉండదు. నటన ద్వారానే ప్రేక్షకులకు గుర్తుండిపోవాలన్నది నా లక్ష్యం అని చెప్పింది.