తెలుగు సినిమా అభివృద్ధికి పాటుపడిన ఎంతోమంది గొప్ప నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శక నిర్మాతలను సత్కరించేందుకు ఏర్పాటు చేసిన ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్స్ 2024 కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. “తెలుగు ఫిల్మ్ అండ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరమ్ చైర్మన్ నాగబాల సురేష్ ఆధ్వర్యంలో ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవార్డ్స్ కార్యక్రమానికి విజన్ వివికె హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్” సంస్థ అధినేత వి.వి.విజయ్ కుమార్ స్పాన్సర్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మురళీ మోహన్, రోజా రమణి, వీకే నరేష్, అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, చంద్రబోస్, రాజ్ కందుకూరి, ప్రవాసాంధ్ర ప్రముఖులు టాక్ షో ప్రయోక్త కిరణ్ ప్రభ, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మాజీ పోలీస్ అధికారి గోపీనాథ్ రెడ్డి, ప్రముఖ నిర్మాత ప్రసన్న కుమార్, జర్నలిస్ట్ ప్రభు తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి ఐ. ఎ. ఎస్. ముఖ్య అతిథిగా హాజరై అవార్డ్ విన్నర్స్ ని అభినందించడం విశేషం.
మురళీ మోహన్ మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీ మూలాలను మర్చిపోకుండా, మన పరిశ్రమకు పునాది వేసిన వాళ్లను గుర్తుంచుకునేందుకు ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించడం అందరూ అభినందించాల్సిన విషయం. రోజారమణి, నరేష్, నేను.. మేమంతా ఇండస్ట్రీకి వచ్చి చూస్తుండగానే ఏళ్లకేళ్లు గడిచిపోయాయి. తెలుగు సినీ పరిశ్రమకు నంది అవార్డ్స్ మళ్లీ ఇవ్వాలని ఇదే వేదిక మీద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కోరాం. ఆయన సీఎం రేవంత్ గారికి చెప్తా అన్నారు. చెప్పిన వారంలోనే ప్రకటన ఇచ్చారు. గద్దర్ గారి పేరు మీద నంది అవార్డ్స్ ఇస్తామన్నారు. ఈ ఏడాది గద్దర్ అవార్డ్స్ ఇస్తారని కోరుకుంటున్నా అన్నారు.